సాక్షి, తిరుపతి : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అలిపిరి టోల్ గేట్‌ను టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తుల వాహనాలు తిరుమల కొండపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాలను కూడా టీటీడీ అధికారులు మూసివేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనాలను నిలిపివేయనున్నారు. అయితే శ్రీవారికి జరిగే ఏకాంత సేవలను అర్చకులు యథాతథంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుమలలో ఉన్నవారికి శ్రీవారి దర్శనం చేసి పంపించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అస్వస్థతకు లోనయ్యాడు. జలబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న అతన్ని గుర్తించిన సిబ్బంది.. ముందు జాగ్రత్తగా తిరుమల అశ్విని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతన్ని రుయా ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కాగా, ఇప్పటివరకు ఏపీలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. దేశవ్యాప్తంగా 166 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అన్నవరంలో భక్తుల సాధారణ దర్శనాలకు మాత్రమే
సాక్షి, తూర్పుగోదావరి : అన్నవరం సత్యదేవుని ఆలయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నుంచి భక్తుల సాధారణ దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఆలయ ఈవో త్రినాధరావు మాట్లాడుతూ.. భక్తులకు అంతరాలయ దర్శనానికి అనుమతి లేదని తెలిపారు. స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, సేవలు యథావిథంగా జరుగుతాయని వెల్లడించారు. భక్తులకు వీటిలో పాల్గొనే అవకాశం ఉండదన్నారు. పదేళ్లలోపు చిన్నారులను, అరవై ఏళ్లు పైబడిన వృద్ధులను ఆలయానికి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆలయంలో అన్నదానంకు బదులు పులిహోరా, దద్దోజనం, సాంబారు అన్నం ప్యాకింగ్‌చేసి భక్తులకు అందజేస్తామన్నారు.